29 November 2011

మనసుకి కళ్ళు ఉంటే...

7 వ్యాఖ్యలు ♥ ツ


(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)
 
ఆకాశాన చంద్రుడి అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, చంద్రుడి చుట్టూ ఉండి, దాని అందాన్ని మెరుగుపరిచే కోటి చుక్కలని పట్టించుకోము
వికసించిన గులాబీ పువ్వు అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, ఆ పువ్వుని కాపాడే ముళ్ళని పట్టించుకోము
ఆకాశాన్ని ఏడు రంగులతో కప్పే ఇంద్రధనస్సు చూసి మైమరచిపోతాము
కాని, ఆ అందానికి కారణమైన ఎండా, వానల కలయికన్న విషయాన్నీ పట్టించుకోము
వాన చినుకులని దోసిలిలో నింపుకుని, పైకి ఎగరేస్తూ, వాటితో ఆడుకుంటూ మైమరచిపోతాము
కాని, ఆ చినుకులని మొస్తూ కుడా హాయిగా, స్వేచ్చగా విహరించే మబ్బులను పట్టించుకోము
ఎక్కడినుంచో ఎగిరి వచ్చి చెట్టుపై వాలిన నెమలి అందాన్ని చూసి మైమరచిపోతాము
కాని, దానికి చల్లని నిడనిచ్చే చెట్టుని పట్టించుకోము
రంగుల రెక్కలతో ఎగిరే సీతకోకచిలక అందాన్ని చూసి మైమరచిపోతము
కాని తన ఈ కొత్త రూపం, గొంగళి పడిన కృషికి నిదర్శనము అన్న విషయాన్ని పట్టించుకోము
ప్రకృతిలో ప్రతి అందాన్ని చూసి మైమరచిపోతము
కాని, ఆ అందానికి కారణమైన మరో అందాన్ని మాత్రం మరచిపోతాము
ప్రతి సాధారణమైన విషయంలో, ఓ అద్భుతం దాగి ఉంది
సౌందర్యం కళ్ళని ఆకర్షిస్తుంది, కాని, ఆత్మసౌందర్యం మనసుని ఆకర్షిస్తుంది!
ఈ విశాల ప్రపంచాన్ని కళ్ళతోనే కాకుండా మనసుతో కూడా పరిశీలించు నేస్తం!!

19 November 2011

నువ్వు ఎరుగని మరో 'నేను'

2 వ్యాఖ్యలు ♥ ツనువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా,
నా కళ్ళలో కన్నీళ్ళను, చిరునవ్వుతో కప్పివేసానని
స్పందించలేని కఠిన రాతి హృదయం నాదని అనుకున్నావా??

17 November 2011

రోజులో, రెండు గంటలు అధికంగా ఉంటే, ఆ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు?

3 వ్యాఖ్యలు ♥ ツ

 
(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

 రోజులో, రెండు గంటలు అధికంగా ఉంటే
నాకు అది ఆనందాల పంటే
మా తమ్ముడిని కాసేపు ప్రేమగా ఏడిపిస్తా..
ఇంట్లో మొక్కలకు సేవ చేస్తా, అవి ఎదుగుతున్నపుడు చూసి ఆనందిస్తా
కార్టూన్లు చూస్తూ, ఐస్-క్రీం తింటా
ఓ కునుకు తీసి, అందమైన కల కంటా
రంగులతో ఆడుతూ అందమైన బొమ్మలు గీస్తా
కుళ్ళు జోకులు వేసి అందరిని ముర్చిల్లెట్టు చేస్తా
ప్రకృతిని అందాన్ని ఆస్వాదిస్తా
దాని అందాలన్నీనా కెమెరా బంధిస్తా
కాగితంపై పిచ్చి రాతలు రాసి, దాన్ని కవితగా మార్చేస్తా
సంగీతాన్ని వింటూ, పాడుతూ ఆడుతూ మైమరిచిపోతా
మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేస్తా
ఇంటర్నెట్లో కాలక్షేపం చేస్తా
మనసులో ఏది దాచుకోకుండా నా భావాలను తెలిపెస్తా
తనివితీరా నవ్వుతా
రోజు ఉండే పనుల నుండి విముక్తి పొందుతా
చివరికి, ఆ భగవంతుడిని ప్రార్థిస్తా
ప్రతి రోజు రెండు గంటలు అధికంగా ఇవ్వమని!!

ఈ కవిత సర్ఫ్ఎక్సెల్ మాటిక్ గెట్ స్మార్ట్ పోటికి వ్రాయబడినది
English version: here

12 November 2011

అమ్మా!! నీకు నేను భారమా??

8 వ్యాఖ్యలు ♥ ツ

(చిత్రాన్ని ఇక్కడ నుంచి సేకరించాను)

అమ్మా!!
నీకు నేను భారమా??
ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా ?
చెత్తకుండియే నాకు స్థానమా?
పేదింటి తల్లి "నిన్ను పోషించలేమమ్మ!!" అని వదిలేస్తుంది
మధ్యతరగతింటి తల్లి "నువ్వు ఓ ఇంటి దానివయ్యాక, మమ్మల్ని ఎవరు చూస్తారమ్మ!!" అని వదిలేస్తుంది
గొప్పింటి తల్లి "మాకు వంశోద్ధారకుడు కావాలమ్మ!!" అని వదిలేస్తుంది
అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం అంటారు కదమ్మా !!
ఎక్కడ ఉందమ్మా సమానత్వం?
ఓ నాటి ఆడపిల్లకే, ఆడపిల్ల అంటే ఇంత చీదరింపు ఎందుకమ్మా ??
మంచికి, చెడుకి తేడా తెలియని ఈ లేత మనసుకి,
నీ కఠిన హృదయం చవి చూపించావా?
కళ్ళే తెరువని ఈ పసి పాప భవిష్యత్తుకి
కన్నీరే మిగిల్చావా?
నవమాసాలు మోసి,
నా దేహానికి ప్రాణం పొసి,
నీలోనే నన్ను వెలికి తీసి,
చివరికి, నన్ను  వదిలేసి,
'అమ్మ' అనే పదానికి అర్ధం లేకుండా ఎందుకు చేశావమ్మ??

నా గురించి ♥ ツ

ఒక్క మాటలో చెప్పాలంటే, పగటి పూట చుక్కలు వెతికే అమ్మాయిని...
తెలుగులో నా భావాలు వ్రాయడం ఈ మధ్యే మొదలుపెట్టాను :)
మీరు నా టపాలు చదివి, మీ అభిప్రాయాలు, సూచనలు తెలుపగలరు
వ్యాకరణంలో తప్పులు ఉంటే మన్నించండి